హరిఓం
ఈ ప్రేలాపనల
గురించిన చిన్నమాట.. వీటిని కవితలు అనబుద్ధి కాదు నాకు.. ఇది అది కాదు. నా
దృష్టిలో ఏది గొప్ప కవితగా భావిస్తానో దానికి ఇది సరిపోలదు. ఏదో వ్రాశాను.. ఎవ్వరి
కోసమూ వ్రాయలేదు. నా కోసమే వ్రాసుకున్నాను... నా ఏకాంతంలో ఆలంబనలు, అంతఃప్రపంచంలో ఆక్రందనలు ఇవి.
నాకు చాలా దగ్గర అనిపించినవారితో, అర్థం
చేసుకుంటారు అనేవారితో- పంచుకునేదాన్ని.. వ్రాసిన వెంటనే తొలిగా బలయ్యే శ్రోత
అమ్మ. అమ్మ బాగుంది అంటే చాలు.. ఆనందం. సంతృప్తి. ఎప్పుడూ ఎవ్వరికి చూపాలి
అనిపించలేదు. అనిపించినా తగిన వ్యక్తులు లభించలేదు. నేను వెతికినా ఫలితం దక్కలేదు.
ఎవరైనా వీటి విమర్శ చెప్పాకే ఇవి పంపాలి అనే పట్టుదల మాత్రం బలంగా ఉండేది.
వ్యక్తులు ఉన్నా అందుబాటులో లేరు. అందుకే ఎక్కడా పంపాలి అని గట్టిగా
ప్రయత్నించలేదు.
అందరూ చదివి ఆనందించాలి, వీటి గురించి గొప్పగా అనుకోవాలి-
అనే లోతైన కాంక్ష నాకు లేదు.. ఉన్నా అది చాలా పిల్లతనంలో వచ్చింది, పోయింది కూడా. అందుకే ఇవి నావరకే ఉండిపోయాయి. ఎవరైనా చూసి వీటికి విమర్శగా
ఏదైనా చెప్తే ఇంకా బాగా వ్రాయలి అని కోరుకునేది మాత్రం పీకలదాకా ఉండేది. ‘ఇంకా బాగా, ఇంకా బాగా.. ఇది కాదు.. ఇంకేదో
వ్రాయాలి.. ఇట్లా ఈ భావాన్ని చెప్తే ఇది తేలిపోతోంది.. ఇది హృదయస్పర్శిగా లేదు..’
అని నాకే అనిపించేది. నాకే నచ్చనిది ఇతరులకు ఎందుకు నచ్చుతుంది?
అందుకే పట్టించుకోలేదు.
అయితే నాకివి నచ్చలేదా..? అట్లా ఏం కాదు.. నేను
వ్రాయగలిగినంత వ్రాశాను.. నచ్చినంత నచ్చింది.. నచ్చనిది,
చర్విత చర్వణంగా ఉన్నదీ ఉంటుంది. నిత్యనూతనంగా వ్రాయలంటే చాలా ప్రతిభ కావాలి.
ఎప్పుడూ అనుకుంటాను- ఒక సంస్కృత శ్లోకం ఉన్నది. దాని భావమిది- ‘కాళిదాసాదులు కవులే.. నేను కవినే.. పర్వతంలో పరమాణువులో కూడా పదార్థత్వము
అనే లక్షణం ఉన్నది కదా.. కనుక వారు పర్వత కవులు, నేను పరమాణు
కవిని’ అని. పోనీలే, అసలు కలం కదిపి
వ్రాయగలగటమే, భావాన్ని ఏదో విధంగా అభివ్యక్తి చేయగలగటమే
పెద్ద వరం కదా! అందుకే ఆ తెల్లవలువల తల్లిని కృతజ్ఞతగా కళ్ళనిండా చూసుకుంటాను.
మొదలు ఇవి కవితలో కావో అనేదే తెలియదు, కనుక వీటి
ప్రయోజనం ఏంటో కూడా నాకు తెలియదు. లయ, గతి, ఛందస్సులు నాకు రావు. పెద్దగ విజ్ఞానం లేదు. చదవలేదని కాదు- చదివినా
అభ్యాసంలోకి ఎక్కనివి అవి. అభ్యాసం చేసే విధానం కూడా తెలుసు.. కానీ ఎందుకో చేయాలి
అనిపించింది కాదు. ఇది నా క్షేత్రం కాదు.. ఒకప్పుడు కొంత కాలం పాటు దీనినే పనిగా
చేసుకోవాలనుకున్నది నిజమే. కానీ దాన్ని సంస్కృతం గెలిచింది. ఆ దేవవాణి రంగు,
రుచి, వాసన తెలిశాక ఇంకేదీ రుచించటం
మానేసింది. తెలుగు నాకు ప్రాణమైతే సంస్కృతం ఆత్మ స్వరూపం అయిపోయింది.
అందుకే వీటిని భావం లోపల బ్రతకనివ్వకున్నప్పుడల్లా వ్రాసుకుని, తేదీలు వేసుకుని మరీ డైరీ లో భద్రపరిచానే కానీ ప్రపంచంలోకి పంపే ధైర్యం
లేదు.. అవసరమూ అనిపించకుండానే ఇన్నేళ్ళూ గడిచిపోయాయి. మరి ప్రత్యేకించి
ఇప్పుడెందుకు ఈ ప్రచురించటం?
పిలుపు లోపలి నుంచి వచ్చిందని వ్రాయటం.. వాటికి యోగ్యత లేదనుకుని
పంపకపోవటం.. అంతా నా ఇష్టమేనా..? వాటికీ ఓ ఇష్టం ఉంటుంది
కదా. అవి ఒకరోజు నన్ను నిలదీశాయి- ‘మమ్మల్ని రూపం ఇచ్చి ఎందుకు నొక్కేస్తున్నావు-
మాకు ఊపిరి ఆడద్దా?’ అని. వాటికి తెలియదు- జనుల నోళ్ళలో,
చూపుల్లో వాటికి ఎంత ఆదరణ ఉంటుందో, ఉండదో..! అయినా తప్పటం
లేదు. ఒక సమయం పరిధి తరువాత కీర్తి కాంక్షో, లోభమో కన్నా
కర్తవ్య నిష్ఠే ఎక్కువైతుంది. నేను ఇప్పుడు వాటికి జవాబుదారును. సమాధానం చెప్పాలి.
అవి నన్ను మూగగా చూస్తున్నాయి. వాటి గతేంటి?
వాటి ప్రశ్న కొన్నేళ్ళ క్రితమైతే సమాధానం లేని ప్రశ్నగా మిగిలపోయేది..
కానీ ఇప్పుడు మాత్రం సమాధానంగా ఇంటర్నెట్ ఉంది.. ఇది నెట్ సౌకర్యం ఇచ్చిన ‘నువ్వూ నీ శైలిలో నీ ఏడుపు ఏడవచ్చు’ అనే సౌకర్యాన్ని
వాడుకునే ప్రయత్నం. ఇది నాకు నేను ఇచ్చుకున్న వచనాన్ని భంగం చేయదు.. అట్లాగని ఇది
సామాన్యంగా అనుకునే ముద్రించుకోవటం, ప్రకాశింపచేయటం కాదు.
జనుల కోసం కాదు.. నాకోసం, నా పలుకుల ఆక్రోశం కోసం.
ఇక్కడెవ్వరూ నన్ను ప్రచురించుకోవటం నుంచి ఆపరు. ఇవి బాగున్నాయో అని తరాజులో తూచరు.
వాటిని పొడిచే చూపులతో చూడరు. బాలేదు అనే కారణాలతో తిరిగి పంపరు. ఇష్టం ఉన్నవారే
చదువుతారు. విసిరితే ఓ పువ్వో, రాయో విసురుతారు, లేదా మౌనంగా
ఊరుకుంటారు. ఎవరైనా మరీ ఉత్సాహవంతులు నచ్చితే బాగుంది అంటారు. ఇవి చదివిన
ప్రతీవాడి హృదయానికి పోయి తాకాలని నియమమేం లేదు.
హృదయస్పందన ఎవరిది వారికి అమూల్యం. పక్కవాడి గుండె కొట్టుకుంటే నాకు లాభం
లేదు.. అది వాడికి జీవించటం లక్షణంగా అవసరం. అదే ఆ గుండె కావలసిన వారిదైతే అది
కొట్టుకుంటే నాది కొట్టుకుంటుంది. ఇదీ అంతే. ఆ కవితల గుండె నా గుండె వంటిదే.
అందుకే అవి బాధతో కొట్టుకుంటుంటే చూడలేక ఈ దారి చూపుతున్నాను.
చిన్నతనంలో ఇవెట్లా ఉన్నాయో.., బాగున్నాయో, బాలేవో, అనే తపన ఉండేది. ఇప్పుడు ఇవి నాకోసం ‘ఆ
సమయపు భావాలు’- అంతే. బాగున్నా, బాగోకపోయినా నాకు భయం, బెంగ, సంకోచం ఏవీ లేవు.
నాకు వీటి మీద ఏ విమర్శనలూ ఇప్పుడు అవసరం లేదు.. చేసినా అవి బాగు చేసుకోవాలనో,
ఇంకేదో విధంగా చెప్పాలనో నేను అనుకోవటం లేదు. అవి నా భావాలు.. నా
కలం పలకించగలగినంతవరకు అవి సత్యాలు. పలికించలేకపోయిన విధానం ఒక నైపుణ్యం లోపమే
కానీ భావలోపం కాదు. కవితకు భావం ప్రాణం. నైపుణ్యం బుద్దికి ఆహారం. భావం మనసుకు
ఆహారం. వాటిలో ఏదున్నా లేకపోయినా నా మనసైతే నిండుగా ఉంది. నాకవి ఈరకంగా ఇష్టం.
పరిశీలన దృష్టితో, వివేచన దృష్టితో చూడకపోతే అవి నా
పిల్లలవంటివి. పిల్లలు పిల్లలే.. బాగున్నా బాగోకపోయినా అవి నాకు ముద్దుగొలిపేవే.
మంచివైనా కాకపోయినా ఫరవాలేదు.. ఉపయోగపడకపోయినా ఎవ్వరికీ హాని చేయవు.. అంతే చాలు.
భాష, పదాల కూర్పు, లోతైన సున్నితమైన
అనుభూతులకు సరైన పదాల గుడ్డలు తొడగటం నాకు థియరీ తెలుసు.. కానీ ప్రాక్టికల్ రాదు.
అందుకు అవి ఇంతే అని సరిపెట్టుకుంటాను.
ఇందులో ఎదురుచూపులు ఎక్కువగా ఉన్నాయి, నా కలంపేరే
నిరీక్షణ.. నా అస్తిత్వమే నిరీక్షణం కనుక. మిగిలినవి జోలలు, ప్రేరణదాయకాలు,
పిల్లల పాటలు, ఒకటీ అరా భక్తి, తత్త్వం.. ఇట్లా సాగుతాయి. కొన్ని సందర్భాల కోసం, కథల
కోసం వ్రాసినవీ ఉన్నాయి. ఎక్కువగా ప్రకృతంటే ప్రాణం. కానీ పెద్దగా ప్రకృతితో
పరిచయం ఏర్పడలేదు కనుక ఎంత అనుభూతి నా సొంతమో అంత ఈ పదాలలో కూర్చాను. ప్రతీ వాడు
మాఘుడు కాలేదు, బాణభట్టు కాలేడు.. కానీ ప్రతీ సృజననూ వాటితో
పోలుస్తూ పోతే లోకంలో కొత్త కలాలు కదలవింక. అందుకే ఈ వెబ్ క్షేపణం. ఇక్కడ క్షేపింస్తే
నా కర్తవ్యం నిర్వహించినదాన్ని అవుతాను. నాకు తృప్తిగా ఉంటుంది. అంతే. ఆ పై పఠిత
దయ, వాటి ప్రాప్తం. నేను తప్పుకుంటున్నాను దృశ్యం నుండి.
నేను ఇంకెక్కడో ఉండను.. వాటినిండా ఉంటానంతే. నమస్తే
No comments:
Post a Comment