Thursday, 29 June 2017

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా
చెప్పాయి ఒకే మాట వినమా
సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక
ఆత్మను పరమాత్మగ చేసే బాసటయే ప్రేమ ॥

కన్నబిడ్డలంటే తల్లికి ఎనలేని మమకారం
అమ్మ చూపులలోనే కురియును తేనెలొలుకు అనురాగం
తల్లిప్రేమకన్నా ఏదీ గొప్పనైంది లేదు సుమా
ఎవరి మనసునైనా కదిపే ఒకే పదం అమ్మ
లోకంలో పోలిక లేనిది నిర్మలమౌ అమ్మ ప్రేమ ॥

వికసించిన పువ్వును చూస్తే తుమ్మెదలకు ఆనందం
పున్నమి జాబిల్లిని చూస్తే కెరటాలకు ఉద్వేగం
తొలి సూర్యుని కిరణం స్పర్శకు పద్మాల్లో ఉల్లాసం
గర్జించే మేఘం పిలుపుకు నెమలి బాల ఉత్సాహం
ఆ భావ మధురిమ పొంగే విభావనే ప్రేమ ॥

గలగలమని గానం చేస్తూ పారే సెలయేళ్ళు
కొండల లోగిళ్ళను జారి నేలకొదుగు జలపాతాలు
రివ్వుమనే రెక్కల తొడిగి దివికెగిరే గువ్వభామలు
చిరునవ్వుల సిరులొలికిస్తూ ఇలవిరిసే పువ్వు జాణలు
స్పందించే హృదయం కళ్ళకు కడుతుందీ ప్రేమ ॥

పర్వతాలు నింగిన సాగే మేఘాలను కుశలమడిగెలే
చల్లని చిరుగాలి తాకిడికి చిగురాకులు పులకరించెలే
తళుకుమనే తారల వెలుగున రేయి చేడె పరవశించెలే
కోయల స్వాగతగీతికతో ఆమనినే పలకరించెలే
ప్రకృతికన్య అణువణువులలో అంతులేని ప్రేమ ॥

తొలిచూపుల కలయికతోనే మొదలగునే కలవరము
తలపుల అల్లరి అల్లికలో జ్ఞాపకాల పరిమళము
చెలరేగే తాపమే మత్తు, వేదనకే హృదయం చిత్తు
ఆ తీయని అనుభూతుల్లో పారేను కాముని ఎత్తు
ఆ మోహం పరిణతి పొంది కలిగేదే ప్రేమ ॥

మెత్తనైన మనసు ప్రేమకు బలమగు ఆలంబనము
బదులుగా ఏమీ కోరని త్యాగమే దానికి బలము
తనను తాను అర్పించుకునే భావమే విచిత్రము
గుండియనే గుడిగా మార్చే ఈ ప్రేమే దివ్యవరము
స్వచ్ఛత నిష్కాపట్యాలే దుస్తులుగా కలది ప్రేమ ॥

జగత్తుపై వ్యామోహాలే అంతమైన వేళ
అంతర్మది లోలోతుల్లో పరమాత్ముని హేల
నిత్యం ఆ మననం స్మరణం అనుక్షణం తలచుకోవడం
తనే వాడు అనబడు సత్యం అనుభవంగా తెలుసుకోవడం
పరాకాష్ఠ స్థితిలో భక్తిగ పండేదే ప్రేమ ॥

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...