Wednesday, 28 June 2017

49. ఒక కథలో భాగంగా వ్రాసినవి


ఋషుల మాట ఇది, ఆర్షబాట ఇది, పెద్దలు కూర్చిన రాచబాట ఇది

వేదం చెప్పిన హితం గ్రహించిన ద్రష్టలు చూపిన వెలుగు బాట ఇది..

దర్శకులై ఆ ఆప్తులు విప్పిన విజ్ఞానపు సత్యాల మూట ఇది

బ్రహ్మే తానై, బ్రహ్మాండాలను సృజన చేసిన బ్రహ్మఆట ఇది

ధ్యానయోగమున మునుల మౌనములు దర్శించిన ఆ దివ్య సత్యమిది

తపస్సు చేతే సత్యాన్వేషణ సాగించిన మహితాత్ముల వాక్కిది

గరుత్మంతుడే దేవేంద్రాదుల గెలిచి తెచ్చిన అమృతపాత్ర ఇది
---------------------


          చెదిరిపోవు ఓ నా మనసా, కరిగిపోవు నీకిది తెలుసా

          ఒక్కసారి ఆగి చూడవా, ఇటువైపుకు తిరిగి చూడవా..

          1. అమావాస్య చిమ్మని చీకటి, విర్రవీగుతున్నవేళలో

          చుక్కలన్ని తళుకున మెరసి, రేయిని ఓడించలేదా..

          2. సుడిగాలి చిన్నిమొక్కను, పెకిలించి పోయినవేళ

          అది మళ్ళీ చిగురులు తొడిగి, సూరీడిని చూడలేదా..

          3. గుడ్డులోన బంధమునున్న, రూపులేని డేగపిల్ల

          ఆకారం పొంది గగనాల అంచులకే ఎగరలేదా..
---------------------

ఈ నిశీధి ప్రమాదాలు ఎంత దూరమో లేవు

వేకువ తొలి ఘడియలకై వేచి చూడు నీవు
ఉషాదేవి మేలుకాంచి కళ్ళు తెరిచి చూసిందా
ఒక్కసారి తన ఉజ్జ్వల దృష్టిని సారించిందా
ఈ చిమ్మని చీకట్లే పటాపంచలైపోవును
కాంతుల కత్తుల గాట్లకు చెల్లాచెదరైపోవును

చీకటి ఒక తెర లాంటిది, వెలుగొస్తే పోతుంది
చిరుదీపపు కాంతి చేత తొలగిస్తే పోతుంది
ఒకే ఒక్క సూర్యుడి కిరణంతో జగమంత వెలుగు
ఆ సూర్యుడు మనమెరుగని పరమాత్ముని నెలవు
చీకటి లో సైతం నువు వెలుగులనే చూడుమా
కనిపించనిదే సత్యం నమ్మి నడువు నేస్తమా..
---------------------


                             ఆకాశపు అంచులు దాటి, పరుగాడెను ఊహ విహంగం
                             తళుకుమన్న చుక్కలు తాకగ, ఎగిసిపడే ఆశల కెరటం
                             యౌవనాన చిరు అలికిడివై, వలపు గీతికే పల్లవివై
                             హృదయవీణ తొలి కదలికవై, చేరరావే ఓ జవరాలా..
 



 

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...