నన్ను
నేను వెతుక్కొంటున్నాను
అలుముకుంటున్న
అసహాయత పొగలో
కొట్టుమిట్టాడుతూ
అలసిపోయి
అస్తిత్వం
కోసం ఆక్రోశిస్తున్న శ్వాస బుసల్లో ॥నన్ను॥
విధి
కత్తి వికటాట్టహాసంతో నిర్దాక్షిణ్యంగా
వేసే
గాట్లకు నా పిడికెడు గుండె
బాధతో
కారుస్తున్న నెత్తుటి కన్నీటిలో ॥నన్ను॥
అణుమాత్రం
పరిమాణం కల
సికత
రేణువులు సూర్య రశ్మితో కలిసి
ఆడే
ఎండమావుల నవ్వులాటలో ॥నన్ను॥
నిశీథి
చీకటి నిశ్శబ్దంగా కబళించటానికి వస్తుంటే
నిర్వేదంగా
కరిగిపోతున్న ఆశల కొవ్వొత్తి
చివరి
వెలుగులలో ॥నన్ను॥
గతం
జ్ఞాపకాలు రగిలించిన
పశ్చాత్తాపాగ్ని
శెగలకు దగ్ధమవుతూ
భస్మీభూతమవుతున్న
మనో మరుభూమిలో ॥నన్ను॥
కనికరంలేని
కాల ప్రకంపనానికి
నిలచి
ఉండలేక దీనంగా కూలిపోయిన
నా
కలల సౌధాల శిథిలాలయాలలో ॥నన్ను॥
No comments:
Post a Comment