Wednesday, 28 June 2017

8. మధురగీతిక



పాడవే కోయిల ఈ మధురగీతిక
మదిలోన వీచింది అనురాగ వీచిక

తలపులకు వచ్చాయి రెక్కలే కొత్తగా
నింగినే తాకగా ఎగిరాయి ఎత్తుగా
ఆనందమైకాన ఊగాయి మత్తుగా
          దరికి రమ్మందిలే మేఘాల మాలిక
          విరుల తూగిందిలే స్నేహాల డోలిక

తేనియలు కురియగా చుక్కలే మెత్తగా
చిగురాకు చిలిపిగా చెక్కిలే ఒత్తగా
పరువాల నేలపై వలపులే విత్తుగా
          చిగురు తొడిగిందిలే చిన్నారి కోరిక
          చెలరేగు ఆశలకు లేదు ఇక తీరిక

పూత పూసిన మావి సిరిమల్లి కోసం
చిరుగాలతో పంపె మదనసందేశం
ఆమనిని తెచ్చేసెనెపుడో మధుమాసం
          జాబిలే తొలగించె చీకట్ల యవనిక
          సడి చేయనందిలే ఏకాంత వాటిక

ఎద కడలిపై అలలు ఉవ్వెత్తు లేచాయి
కనులు దాటిన కలలు తీరాన వేచాయి
పెదవి మాటున కథలు పదిలంగ దాచాయి
          తీయని కలయికకు హరివిల్లు వేదిక
          వేగరా మాధవా వేచింది రాధిక

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...