Wednesday, 28 June 2017

64. ఓ గుండె గోడు



దారితెలియని పయనంలో
నాకు నేనే ఒక ప్రశ్ననై మిగిలిపోయాను
కమనీయమైన కలలతో మలుచుకున్న
ఆశల సౌధపు గుమ్మంలో నిలబడి
నా భవిష్యత్తు నన్ను పిలుస్తోంది
నీకై నేను వేచినాను- రమ్మని.

అసహాయత గుండకు
వాస్తవాల ఇనుప సంకెళ్ళతో
నన్ను కట్టిపడేసిన వర్తమానం మాత్రం
నన్ను అడుగు కదపనివ్వటం లేదు
గింజుకున్నా దవలటం లేదు

ప్రమిదలో కాలే దీపంతో
ఆవిరవుతున్న నూనెలా
నా ప్రమేయం లేకుండానే
నిండుకుంటోంది ఆయువు
ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలలోంచి జారిపోతుంటే
దాన్ని ఆపలేక నేను ఆగాను

నాలో కదలబోయిన ప్రతీ ఆశాగళాన్ని
నిర్దాక్షిణ్యంగా తన పిడికిట్లో నలుపుతూ
పాశవిక ఆనందంతో
వికటాట్టహాసం చేస్తోంది విధి పిశాచం
దానికి శక్తి నాకన్నా ఎక్కువే!

జీవితం చేతులలోంచి
కానికాలపు కొండచరియల పల్లాలలోకి
జారి దొర్లి పోతున్న
అవకాశాల అమూల్యమణులను
తిరిగి పొందగలనో మాత్రం నాకు తెలియదు

నియతి విసుర్రాయి కింద పడ్డ
వడ్లగింజనై నిస్సహాయంగా నలిగిపోతూ
చిట్టచివరి ఆకాంక్ష అయిన
నా అస్తిత్వం చేసిన ఆర్తనాదం
ఆ రాతిబండల రొదల మధ్య సమసిపోయింది
దానికోసమే నిరీక్షిస్తున్నాను,
అది తిరిగి రాదని తెలిసినా

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...