Wednesday, 28 June 2017

61. నా ఉనికి చిరునామా



కళ్ళలో నే పెంచుకున్న కలలు కల్లలై
కన్నీటితో కలిసి జారిపోతుంటే
మసకబారుతున్న భవిష్యత్తు వంక చూశాను మౌనంగా

విధి నిశీథి సామ్రాజ్యం విస్తరిస్తున్న వేళ
అస్తగిరి అగాధంలోకి వెళిపోయిన ఆశల సూరీడికోసం
ఆకాశమంతా గాలించాను మూగగా

గుండె తలుపులు బద్దలు కొట్టుకుని
దూరంగా పారిపోతున్న ధైర్యాన్ని ఆపే చేవ లేక
బరువెక్కిన శావ్సల్లో ఉక్కిపోయాను నిస్సహాయంగా

గతం తాలూకు ఓ జ్ఞాపకం
నా వర్తమాన వ్రణం మీద మందు నెపంతో రాసిన
లవణం బాధకు విలవిలలాడాను అమాయకంగా

దాని వంక ఆవేశంతో పరిగెత్తిన
ఉక్రోషమనే అశ్వాన్ని పగ్గంపట్టి లాగే ప్రయత్నంలో
విఫలమైనాను నిస్సత్తువుగా

అనువుగాని చోట అనువుగాని చోట
అద్దంలో కొండలా తగ్గి ఉండాలన్న
వేమనగారి సూక్తి తలచాను భక్తిగా

క్షణక్షణానికి భారమవుతున్న బ్రతుకు బస్తాను
భుజానికి ఎత్తుకుని, లేచి, తెలియని గమ్యం దిక్కుగా
అడుగులు వేశాను నిశ్శబ్దంగా

వెతకవలసిన ఉనికి చిరునామా కోసం
ఈ పయనం సాగించక తప్పదుగా..

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...