Wednesday, 28 June 2017

33. నాలో నిండేవు నువ్వే



వెచ్చన వెన్నెల నింగిని జారి
నేలతల్లి ఒడిలో సోలేటి వేళ
తెల్లని పొగమంచు ఏటిలోన కలువ
రేకుల్లో ముత్తెమై మెరిసేటి వేళ
కను లతోటల్లో కలపువ్వువై నువ్వు విరిసేవులే
మనసు పాటల్లో సిరిమువ్వవై నువ్వే పలికేవులే

అల్లరి వాగుల అల్లిబిల్లి నడకల్లో
కొత్త తదలికలేవో కదలాడుతుంటే
చల్లని గాలుల తుంటరి కబురుల్లో
వింతైన కవ్వింపులు జత పాడుతుంటే
ఎదలో ఏదో కలత, ఉండుండి గుబులాయే
తెలియనిదేదో కొరత కొండంత దిగులాయే
రేయి చేడె చీకటి చీరను కట్టి
వయ్యారంగా ఇలను చేరేటి వేళ
నిదురంతా దోచేసి మదిలో వలపై నువ్వు నిండేవులే

ఆశల నావల ఆనంద తీరాలలో
కమ్మని కోరికలే విచ్చుకుంటుంటే
ఊహల కోకిల ఆమని గీతాలలో
అనురాగ రాగాలు అల్లుకుంటుంటే
పెదవిని హృదయపు అలజడి వణికిస్తుందాయె
పెగలని గొంతుక అలికిడి వినిపిస్తుందాయె
కడలి కెరటం పున్నమి పువ్వును ముద్దాడ
ఉవ్వెత్తు మబ్బులకెగిసేటి వేళ
గుండె లోతుల్లో చిరుదివ్వెవై నువ్వే వెలిగేవులే

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...