Wednesday, 28 June 2017

59. పోతోంది



ఓ జీవితమా కన్నులు తెరవ్వే
ఆయువు ఊపిరి లోంచి జారిపోతోంది

గుండెలో ధైర్యాన్ని గుట్టుగా పెట్టుకో
కన్నీటితో కలిసి కారిపోతోంది

నిరాశ నిశీథిలో చిరునవ్వు వెలిగించుకో
ఆశ దీపం చూడు ఆరిపోతోంది

ప్రతిరోజు పాఠాలు నేర్వాలి కొత్తగా
లోకం తీరు క్షణంలో మారిపోతోంది

కష్టాన తోడుకై ఎదురు చూడకుమా
నీడ కూడా చీకటిలో పారిపోతోంది

ఊహలోకాలకిక తెరదించవోయి
సమయం వేగంగ సాగిపోతోంది

అలల సాయం కోరు, ఒడ్డు చేరాలి
ఒడిదుడుకులకు నావ ఆగిపోతోంది

నిప్పు లాంటిది కోర్క దరిచేరనీకు
ఆ తాపానికే తనువు కాలిపోతోంది

అలసినా సొలసినా పయనమాగదులే
కనురెప్ప బరువుగా వాలిపోతోంది

కలల సౌధాన్ని కాంక్ష నిర్మించినా
వాస్తవం కాదుగా, కూలిపోతోంది

కోయిలలు అడిగినా పాడలేవిప్పుడు
శిశరం కదా ఆకు రాలిపోతోంది

మేఘమా ఆశ అను నీరు వర్షించవే
ఓర్పు మొక్కెందుకో వాడిపోతోంది

దీపముండగ ఇల్లు దిద్దుకోలేదుగా
శ్వాస కాలంతో ఓడిపోతోంది

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...