Wednesday, 28 June 2017

20. చిన్నారి కోరిక



సరదాగా ఊహల రెక్కలతో ఆకాశం ఎగిరి అందుకోనా
విరజాజుల వన్నెల కౌగిట్లో నీహారికనై కరిగిపోనా
సుగంధాల చిరువీచికలా పరుగాడే ఈ కోరికలు
ఈ కలల పూలతోటలో చిరకాలం ఉండిపోనా

వేకువనే తూర్పున పండే
ఎరుపు తెచ్చి నా బుగ్గలకే అద్దుకోనా
ఉదయాన్నే కాంతులు కురిసే
సూరీడిని నుదుటి బొట్టుగా దిద్దుకోనా
చిని ఆశల విరిడోలికలో, తేలియాడు నా తీరికలు
ఈ కాంక్షల ఊయలూగుతూ కలకాలం నిలిచిపోనా

రేయితీగ కొమ్మల విరిసే
చుక్కలతో పూలజడలే అల్లుకోనా
నేల నింగి కలయిక పూసే
ఇంద్రధనుస్సు నా మకుటంగా కూర్చుకోనా
మురిపెంగా ఎద వేదికపై గళం విప్పు సిరిగీతికలు
ఈ రాగం అనురాగంలో లాలిమనై కలిసిపోనా

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...