Wednesday, 28 June 2017

43. నీవు రాలేదెందుకో



పగటిరేడు పడమటింటికి చేరిపోయే
సందెవెలుగులు చిన్ని దివ్వెన ఇమిడిపోయే
తూరుపింట్లో ఒళ్ళు విరిచే రేయి రాజు
రాతిరొడిలో ఒదిగిపోయే నేటిరోజు
          పొద్దుగుంకే చీకటొచ్చే - చంద్రుడొచ్చే చుక్కలొచ్చే
          అశ్రువులు కనువీడినా మరి నీవు రాలేదెందుకో

గోరువెచ్చని సూర్యుడొచ్చి పలకరించే
మిట్టమద్దెన మండుటెండే పరితపించే
సాయమై ఓదార్చి పోయే గాలి తునక
సందె ముందే గూడు చేరెను గోరువంక
          రేయి గడిచి చీకటొచ్చే - చీకటెళ్ళి వెలుగులొచ్చే
          వెలుగులన్నీ చీకటైనా నీవు రాలేదెందుకో

మల్లియలు విరిపించి పోయెను ముద్దు ఆమని
చినుకులను కురిపించి పోయెను మేఘమాలిని
పండువెన్నెల వేడ్క తెచ్చెను వెండిశరదం
మంచువానల ముడుపు తెచ్చెను చల్ల శిశిరం
          ఆకురాలే కాలమెళ్ళీ - మోడుకొమ్మకు చిగురులొచ్చే
          కోయిలెంతగ పిలిచినా మరి నీవు రాలేదెందుకో

మనసు మాటున పెరుగుతున్నది కలకలం
ఘడియఘడియకు రేగుతున్నది కలవరం
కళ్ళచాటున దాగనన్నది అలజడి
పెదవి తలుపులు తట్టి పోయెను కనుతడి
          కలలు పోయే కలత పెరిగే - కలతతో నిబ్బరం కరిగే
          అశ్రువులు కనువీడినా మరి నీవు రాలేదెందుకో

ఆలకిస్తున్నవీ వీనులు ప్రతీ సవ్వడి
గుండియను ఝల్లుమని కదిపే ప్రతీ అలికిడి
చల్లగాలికి చిగురుటాకుల కదలికైనా
నీవెనని భ్రమిసింది ఎద ఏ సద్దుకైనా
          కలలు కల్లై, ఒళ్ళు కళ్ళై - పూలు ముళ్ళై వాకిలిల్లై
          అలుపుతో నే సోలినా మరి నీవు రాలేదెందుకో

గుండె గదిలో కొండఎక్కెను ఆశదీపం
ఎన్నటికి తీరేనొ ఈ జవరాలి శాపం
మనసు లోగిలి తలుపు గడపన ప్రతి క్షణం
ఒక యుగముగా సాగింది ఈ నా నిరీక్షణం
          జీవితేచ్ఛకు అలుపు వచ్చే - మృత్యుఒడికై తలపు వచ్చే
          చివరి ఊపిరి వీడుతున్నా నీవు రాలేదెందుకో

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...