Thursday, 29 June 2017

76. నన్ను నేను వెతికాను


ఎండలలో వానలలో
కొండలలో లోయలలో
ఆకాశపు లోతులలో
కడలి పొంగు ఎత్తులలో
పెనుతుఫాను దారులలో
జలపాతపు హోరులలో
రేయి పగలు పోరులలో
ఎక్కడ పడితే అక్కడ
నన్ను నేను వెతికాను

నిప్పంటిన గుండెలలో
కాలిపోయిన కలలు చూసి
కన్నీరై కారి పడిన
నిండు మనసు మంటల్లో
ఎగిసి పడే జ్వాలలోంచి
ఆవేదన సడులలోంచి
నా వేదన స్వరాలకై
గుండె వద్ద చెవులనుంచి
నన్ను నేను వెతికాను

ఆగలేక సాగలేక
కదిలేందుకు చేవలేక
కదలకుండ నిలవలేక
ఒకే చోటు పాతుకుపోయి
జీవచ్ఛవమవ్వలేక
అనునిరతం పయనానికి
పాదాలను కదిలిస్తూ
ఈ శోధన సాగిస్తూ
నన్ను నేను వెతికాను

తిరిగి రాని కాలంలో
కరిగి కలిసిపోయానో
చేజారిన క్షణాలలో
విరిగి పగిలిపోయానో
ముక్కలుగా మిగిలానో
రెక్కలు తెగి వగచానో
చిక్కు పడ్డ ముడులలోంచి
బ్రతుకు పొడుపు కథను విప్పి
నన్ను నేను వెతికాను

బాటమరలి పోయాను
గమ్యమెటో మరచాను
ఎరకలేని వీథుల్లో
ఒంటరిగా మిగిలాను
ఆ అనంత ఎడారిలో
తీరలేని దప్పికతో
ఆరిపోని కోరికతో
చచ్చిపోని నమ్మికతో
నన్ను నేను వెతికాను

అడుగులతో కొలవలేని
బహుదూరపు గమ్యాల్లో
మోయలేని భారాల్లో
మానిపోని గాయాల్లో
అర్థమేమిటో తెలియని
నవకావ్యపు భావాల్లో
ఆ కాటుక చీకటిలో
ఆ శ్మశాన మౌనంలో
నన్ను నేను వెతికాను

గడిచిపోని గతాల్లోంచి
వినిపించే పిలుపులలో
కడపటిగా మిగిలిపోయిన
ఓ గుప్పెడు క్షణాలలో
ఆరిపోయినా చెరగని
విశ్వాసపు వెలుగులలో
ఒక్కక్షణం గడువిమ్మని
పేర్చి ఉన్న చితిని కోరి
నాకు నేను కావాలని
నన్ను నేను వెతికాను

No comments:

Post a Comment

77. ప్రేమ

కాళిదాసు కావ్యాలైనా, త్యాగరాజు రాగాలైనా చెప్పాయి ఒకే మాట వినమా సృష్టి మనకిచ్చిన కానుక, అన్ని భావాలకు తలమానిక ఆత్మను పరమాత్మగ చేస...